గంగానదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?


భగీరథుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితురులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి గంగానదిని తీసుకువచ్చాడు. గంగానది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది. గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది.
గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు. తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగునని పండితులు అంటున్నారు. గంగాదేవి మహిమను విన్నా చదివినా సకల వ్యాధులు నశించి, శుభ ఫలితాలు కలుగును.
భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై భీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు. ఇందులో భాగంగా గంగా, యమున, సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసినదానికంటే అధికమని చెప్పాడు.
ఇంకా గంగా మహిమ గురించి భీష్ముడు ఏమన్నాడంటే.. గంగాజలం కొంచమైనా దేహమునకు సోకినట్లైతే సకల పాపములు నశిస్తాయి. నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.
గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు. గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం. గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానంము కలిగించుచూ పాపములను దూరం చేయును.
మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును. గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం, రాజ భయం, చోర భయం, భూత భయం మొదలైన భయములు నశించును.