గోవిందనామాలతో తులసీ పూజ చేస్తే?


విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒక్క తులసిదళాన్ని తన పాదాలచెంత సమర్పించడం వలన, వివిధ రకాల పూలతో పూజించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు.
అందుచేత పూజా మందిరాల్లోనూ స్వామివారిని తులసిదళాలతో పూజిస్తుంటారు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమనీ ... అందువలన స్వామివారు తులసికోటలో నివాసముంటాడని పండితులు చెబుతున్నారు.
విష్ణుమూర్తి అనుగ్రహం కోసమే చాలామంది ఇంట్లో తులసీకోటను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. అనునిత్యం తులసికి నీళ్లు పోసి దీపం పెట్టి ప్రదక్షిణలుచేస్తూ పూజిస్తుంటారు. ఇంకా గోవింద నామాలు చెబుతూ తులసిని పూజించడం వలన, సమస్తపాపాలు దోషాలు నశిస్తాయి.
దారిద్ర్యం వలన కలిగే బాధలు, వ్యాధులు దూరమైపోతాయి. సిరిసంపదలు, సుఖశాంతులు చేరువవుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం, దివ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం ... గోదానం చేసిన ఫలితం విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించడం ద్వారా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.