హనుమజ్జయంతి... ఆంజనేయ స్మరణ వల్ల లాభాలు....


బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్
చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం. అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి. ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందు వల్ల భయం లేనితనం.
ఆంజనేయుణ్ణి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం, మనసుకు ఏవిధమైన జడత్వం(నిరాశ నిస్పృహ) లేనితనం, మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం.. ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల లభిస్తాయి.
ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల ఈ సత్ఫలితాలు కలుగుతాయనే పై శ్లోకాన్నే ఆంజనేయ స్తోత్రంగా చదివేస్తుంటారు అందరూ. ఈ శ్లోకం ఫలశ్రుతి( ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల కలిగే ఫల-ప్రయోజనాలను, శ్రుతి విన్పించేది) అన్నమాట.