సంకటహర చతుర్ధిPlease Click on Image బహుళ చతుర్ధశిని "సంకటహర చతుర్ధి" అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుడిని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు. ప్రతినెలలో వచ్చే సంకటహర చతుర్ధి కంటే మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు విఘ్వేశ్వరునికి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయిస్తే పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.
అలాగే ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకునికి నిష్టతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యముగా సమర్పించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంకా సంకటహర చతుర్ధి నాడు సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి.
పసుపు, కుంకుమలు, పుష్పాలతో పూజామందిరమును దివ్య సుందరముగా అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి. అదే రోజున వినాయకుని ఆలయాల్లో జరిగే అభిషేకాలు, ప్రత్యేక పూజలు పూర్తయ్యాక విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి.
ఇంకా సంకట హర చతుర్ధినాడు ఆలయాల్లో జరిగే అభిషేకాలకు సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, గరిక మాల వంటివి సమర్పించుకుంటే సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.
అదే రోజు ఆరు గంటలకు ఇంట్లో దీపమెలిగించి వినాయక ప్రతిమ లేదా ఫోటోను గరికమాలను అలంకరించుకుని, పంచహారతినిచ్చి నైవేద్యం సమర్పించుకునే వారికి ఆర్థిక వృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉన్నత పదవులు వంటి శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు.