శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి


నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం
ఛాయా మార్తాండ సంభూతం నమామి శ్రీశనైశ్చరం- శనీశ్వరుడు గ్రహాధిపతి. నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ప్రభావశాలి. మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మకర కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞ, ఆమె సంతానం వైవస్వతుడు, శ్రాద్ధదేవుడు, యముడు, యమున. సంజ్ఞ సూర్యుని తేజాన్ని భరించలేక తననుంచి ఛాయను సృజించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయింది. ఛాయకు సూర్యుడికి సావర్ణుడు, శనైశ్చరుడు జన్మించాడు.
శనీశ్వరుని గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాలు విభిన్న విషయాలు వివరిస్తున్నాయి. శని మందగమనం గలవాడు గనకు మాదుడు అంటారు. ఇతని వాహనం కాకి, నలుపు, నీలివర్ణాలు ఈయనకు ఇష్టమైనవి. జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకం ఇష్టం. శని భార్య జ్యేష్ఠాదేవి.
సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి.
శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను సిద్ధింపజేస్తాడు.
అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది. కానీ శని దూషణ కూడదు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతాకృపతో సమానం.
కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి. శనీశ్వరునికి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తైలాభిషేకం శ్రేష్ఠమైనదంటారు. అలాగే ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు తిలదానం కూడా ప్రశస్తమని చెబుతారు. దశరథుడు, నల మహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి. లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. కోణస్థ, పింగల తదితర శనిదశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే శని బాధ కలగదని విశ్వాసం. శనిత్రయోదశి అయిన నాడు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.!