గోశాల


హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

వశిష్ఠ మహర్షి అరుంధతి పుణ్యదంపతులు.. కామధేనువు..!
వశిష్ఠ మహర్షి, అరుంధతి లోకానికి ఆదర్శంగా నిలిచిన పుణ్యదంపతులైతే వారి వద్ద ఉండిన కామధేనువు సకలసంపదలను ప్రసాదిస్తుంది. వశిష్ఠ మహర్షి ఎంతటి తపోశక్తి సంపన్నుడో, పాతివ్రత్యంలో అరుంధతి అంతటి శక్తి సంపన్నురాలు. దైవారాధనలో వారి ఆశ్రమ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంటుంది.
వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. అందుకోసం వశిష్ఠ మహర్షి ప్రయత్నాలను అడ్డుకోవడానికి నానాప్రయత్నాలు చేస్తుంటాడు. అయినా అవేవీ ఆయన తపోశక్తిముందు నిలవలేకపోతుంటాయి. దాంతో దేవేంద్రుడు ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.
వాళ్ల ఆకలి బాధను చూడలేకపోయిన అరుంధతి, ఆ బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుతుంది. ఈ క్రమంలో అమ్మవారు అరుంధతికి ఒక కామధేనువును ప్రసాదిస్తుంది. కావలసినవాటిని కోరుతూ ఆ కామధేనువును ప్రార్ధిస్తే అవి వెంటనే సమకూరతాయని ఆ తల్లి సెలవిస్తుంది.
సంతోషంతో అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్న అరుంధతి ... ఆ కామధేనువును ప్రార్ధించి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది. ఉద్దేశ పూర్వకంగా తమని ఇబ్బందిపెట్టడం కోసం దేవేంద్రుడు సృష్టించిన కరవుకు, కామధేనువుతో అరుంధతి సమాధానం చెబుతుంది.
యజ్ఞాల్లో, పూజల్లో ఆవుపాలునే ఎందుకు వాడతారు?
పూజాకార్యక్రమాలు, వ్రతాలు, యజ్ఞాల్లో ఆవు పాలునే ఎందుకు వాడుతారని తెలుసుకోవాలనుందా అయితే ఈ కథనం చదవండి. గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని పండితులు చెబుతున్నారు.
"సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం"- శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటి దానివని, ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం గోమాతని, అందుచేతనే ఆవుపాలును శ్రేష్ఠమైందని పురోహితులు అంటున్నారు.

బుధవారం గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠమట!

స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకునేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి. వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని చేయాలి. బుధవారం పూజచేసేవారు వంటలలో ఉప్పును ఉపయోగించకూడదు.
ఆకుకూరలు, పచ్చ అరటి పండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే తీసుకోవాలి. పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నైవేద్యం ఇచ్చి, ప్రసాదంగా స్వీకరించాలి.

గోవర్ధన పూజ