ఋషిపంచమిఋషిపంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " ఋషిపంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసినరోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . . గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు . మానవుని శరీరం లో ఏడు యోగచక్రాలు ఉంటాయి , వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు .


మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం... భాద్రపద శుద్ద పంచమి . ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలిగురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీఱుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికీ తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు ఉప్మా తీసుకోవచ్చు. అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.
కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!


నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. దీన్ని భాద్రపద మాసం శుద్ధపంచమిరోజున ఆచరిం చాలని భవిష్యోత్తరపురాణం తెలియచేస్తోంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.