వసంత పంచమి


చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మదిన సందర్భంగా మాఘశుద్ధ పంచమినాడు ‘‘వసంత పంచమి’’ పండుగను నిర్వహించుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘‘శ్రీ పంచమి’’ అనే పేరుతో కూడా పిలుచుకుంటారు. ఏవిధంగా అయితే దుర్గాదేవిని నవరాత్రులవరకు పుస్కరించుకుని, పూజించుకుంటారో... అదేవిధంగా ప్రతిఒక్కరు వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ పండుగ అంటే ఎంతో మక్కువ. చిన్నారులకు ఈ పర్వదినం రోజు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. భవిష్యత్తులో వారు ఉన్నత విద్యలను పొందుతారు. సాధారణంగా చెప్పుకోవాలంటే.. కాలేజీల్లో కూడా సరస్వతీ దేవికి ఈ పర్వదినంనాడు ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. ఎంతో శుభదినమైన ఈ వసంత పంచమినాడు చాలామంది పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మరికొంతమంది సూర్యభగవానుడికి, గంగానదికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహిస్తారు.

సరస్వతీ దేవీలో వున్న విశిష్టతలు :


సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అర్థాంగి సరస్వతీ. సరస్వతీ దేవీకి వున్న నాలుగు చేతులు, నాలుగు దిక్కులకు సంకేతంగా వుంటాయి. సరస్వతీ తన నాలుగు చేతులలో నాలుగు రకాల వస్తువులను పట్టుకుని వుంటుంది. ఆ నాలుగు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావాన్ని కలిగి వుంటాయి.

1. పుస్తకం : విజ్ఞానానికి సర్వస్వం లాంటి వేదాలు ;
2. జపమాల : అక్షరజ్ఞానంతపాటు శ్రద్ధాశక్తులను పెంచుతుంది.
3. వీణ : ఇది కళలకు సంకేతం. అతీంద్రియ శక్తులను అందించి మోక్షం కలిగించడానికి దోహదపడుతుంది.
4. కమలం : ఇది సృష్టికి సంకేతం.
అలాగే సరస్వతీదేవి ధరించివున్న తెల్లని చీర స్వచ్ఛతకు, ప్రశాంతతకు నిదర్శనంగా వుంటుంది. సరస్వతీదేవి పుట్టింది కూడా చలికాలంలోనే కాబట్టి.. ఆమె చల్లదనం కారుణ్యానికి కూడా సంకేతంగా వుంటుంది.

పూజావిధానం :


వసంత పంచమిరోజు భక్తులు సరస్వతీ దేవిని పసుపుచీరతో అలంకరిస్తారు. తాము కూడా పసుపు వస్త్రాలను ధరించి, సరస్వతీ దేవికి పూజలను నిర్వహించుకుంటారు. మిఠాయిలు దేవీకి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా అందరికీ పంచిపెడతారు. సరస్వతీదేవిని పూజించే సమయంలో ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.

ఓం సరస్వతీ మహాభాగ్యే విద్యే కమలలోచనే
విశ్వరూపే విశాలాక్షీ, విద్యాం దేహి నమోస్తుతే
జయజయ దేవి చరాచరశరీ కుచయుగ శోభిత ముక్తహారే
వినా రంజిత పుస్తక హస్తే భగవతి భారతి దేవి నమోస్తుతే